నేషనల్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌

రెండింతలైన నేషనల్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌
రూ. 6వేల నుంచి 12వేలకు పెరిగిన ఉపకారవేతనం
ఎనిమిదో తరగతి విద్యార్థులకు కేంద్రం వరం
సర్కారు స్కూళ్లవారికే అవకాశం

లింగాలఘణపురం (జనగామ జిల్లా), 03-08-2018: కేంద్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు అందించే స్కాలర్‌షి్‌పను రెండింతలు చేసింది. ఈ యేడాది నుంచే ఇది అమలులోకి వస్తుంది. ఇప్పటిదాకా ఏడాదికి రూ. 6వేలు అందజేస్తున్న మానవ వనరుల మంత్రిత్వ శాఖ పెరిగిన విద్యావసరాల ఖర్చుల దృష్ట్యా ఇక నుంచి రూ.12 వేలను అందజేసేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో వేలాది మంది విద్యార్థులు ప్రయోజనం పొందనున్నారు. యేటా సెప్టెంబర్‌లో అర్హత పరీక్ష నిర్వహించి విద్యార్థులను ఎంపికచేస్తారు. దీనికి సంబంధించి ఈ నెలలోనే నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉంది. వీలైనంత ఎక్కువ మంది విద్యార్థులను ఎంపిక చేసే బాధ్యత పూర్తిగా సంబంధిత ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులపైనే ఉంటుంది.

ఎవరు అర్హులు
ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతూ ఏడో తరగతి వార్షిక పరీక్షలో 55శాతం మార్కులు సాధించిన విద్యార్థులు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ నిర్వహించే నేషనల్‌ మీన్స్‌ అండ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ కోసం నిర్వహించే జాతీయస్థాయి అర్హత పరీక్షకు అర్హులు. ఎస్సీ, ఎస్టీలుకు 50శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. తల్లిదండ్రుల సంవత్సరాదాయం రూ. 1.50లక్షల లోపు ఉండాలి. విద్యార్థులు రూ. 100 పరీక్ష ఫీజు చెల్లించాలి. దళిత, గిరిజన విద్యార్థులైతే రూ.50 చెల్లిస్తే సరిపోతుంది. మండల, జిల్లా పరిషత్‌, ఎయిడెడ్‌, మునిసిపల్‌, టీఎస్‌ మోడల్‌ స్కూళ్లు, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులు.

ఎగ్జామ్‌ ప్యాటర్న్‌ ఎలా ఉంటుందంటే
మూడు గంటల పాటు నిర్వహించే ఈ పరీక్షలో మొత్తం 180 ప్రశ్నలు ఉంటాయి. 90 ప్రశ్నలు మెంటల్‌ ఎబిలిటీ, 90 ప్రశ్నలు మ్యాథ్స్‌, సైన్స్‌, సోషల్‌ సబ్జెక్టులకు సంబంధించినవి ఉంటాయి. ఈ ఏడాది ప్రవేశ పరీక్షకు సంబంధించిన షెడ్యూల్‌ ఈ నెలలో విడుదల అవుతుందని, సెప్టెంబర్‌లో పరీక్ష ఉంటుందని ప్రభుత్వ పరీక్షల విభాగం జిల్లా ఇన్‌చార్జి రామచంద్రారెడ్డి తెలిపారు.

జిల్లా కేంద్రంలో పరీక్షల నిర్వహణ
నేషనల్‌ మీన్స్‌ అండ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ అర్హత పరీక్షలను నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రిసెర్చ్‌ ట్రైయినింగ్‌(ఎన్‌సీఈఆర్‌టీ) సంస్థ ఆధ్వర్యంలో ప్రతీ జిల్లా కేంద్రంలో ఎగ్జామినేషన్‌ సెంటర్‌లను ఏర్పాటు చేస్తుంది. ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు ఎంపిక చేసిన ఇన్విజిలేటర్లు పర్యవేక్షిస్తారు.

జిల్లాలో గతేడాది 44 మంది విద్యార్థులు ఎంపిక
గతేడాది జనగామ జిల్లా నుంచి 44 మంది విద్యార్థులు అర్హత సాధించారు. వీరికి 9,10,11,12 తరగతులు పూర్తయ్యేంతవరకు ఏడాదికి రూ.12వేల చొప్పున నాలుగేళ్లకు మొత్తం రూ.48వేలు వారి ఖాతాలో జమ అవుతాయి.

Comments

Popular posts from this blog

DRDO Scholarships to Girls 2019

How to Apply for IBPS POs Recruitment